Devineni Uma: 2029 ఎన్నికల కోసం టీడీపీ సీనియర్ నేత పక్కా స్కెచ్..

తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేతలలో దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao)కి ప్రత్యేక స్థానం ఉంది. 1999లో తొలిసారి నందిగామ (Nandigama) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన ఉమా, 2004లో రెండోసారి విజయం సాధించారు. కానీ 2009లో నందిగామ సీటు ఎస్సీ రిజర్వ్‌గా మారడంతో ఆయన మైలవరం (Mylavaram) నియోజకవర్గం వైపు మొగ్గుచూపారు. అక్కడి ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన ఉమా, 2009, 2014లో గెలిచి మళ్లీ అసెంబ్లీకి వెళ్లారు.
ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రభుత్వం ఏర్పరచినప్పుడు, ఉమాకు జలవనరుల శాఖను అప్పగించారు. ఐదేళ్లు మంత్రిగా సేవలందించిన ఆయన, పరిశ్రమపై గల పట్టు, సీనియారిటీతో పార్టీ లోనూ గౌరవం పొందారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) ఆయనను ఓడించారు. అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన ఉమా అసెంబ్లీకి దూరమయ్యారు.
2024లో అయితే పరిస్థితి మరో మలుపు తిరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని (YCP) వదిలి టీడీపీలో (TDP) చేరి మళ్లీ మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఫలితంగా ఆ నియోజకవర్గంలో ఉమాకు చోటు దొరకలేదు. ప్రస్తుతం వసంత కృష్ణ ప్రజలతో మంచి అనుబంధం ఏర్పరచుకోవడంతో పాటు నియోజకవర్గంలో కూడా మంచిపట్టు సాధించి బలంగా ఎదుగుతున్నారు. ఇది చూస్తే 2029లో మైలవరం నుంచి ఉమాకు అవకాశం లభించటం కష్టమేనన్న భావన ఆయన వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే ఉమా మాత్రం రాజీ పడే వారు కాదు. దీంతో ఆయన ఇప్పటికే ప్లాన్ బీపై దృష్టిపెట్టినట్టు సమాచారం. వచ్చే రెండేళ్లలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగనుండటంతో, 2029 నాటికి నందిగామ సీటు ఓపెన్ కేటగిరీగా మారుతుందని ఆయన ఆశిస్తున్నారు. అదే జరిగితే తన మొదటి సీటు అయిన నందిగామ నుంచే మళ్లీ బరిలోకి దిగే ఆలోచన ఆయనలో ఉందని అంటున్నారు. అక్కడ దేవినేని కుటుంబానికి ఇప్పటికీ గట్టి పట్టు ఉన్న నేపథ్యంలో, ఆయనకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయాల్లో నాలుగేళ్లు తక్కువ కాలం కాదు. అయినా దేవినేని ఉమా ముందుగానే అలోచనలు మొదలుపెట్టి వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఉమా 2029 లక్ష్యంగా ముందే లెక్కలు వేసుకుంటున్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.