సచివాలయం, పోలవరాన్ని కూడా కూల్చివేస్తారా?
ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఓ తుగ్లక్ చర్య అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజావేదిక అన్ని వర్గాల ప్రజల వేదికని ఆయన చెప్పారు. తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్‌ను గుర్తుకు తెచ్చారని ఆరోపించారు. కొత్త భవనాలు నిర్మించకుండా ఉన్నవి కూల్చడం సరికాదని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కంటే విధ్వంసంపై దృష్టిపెట్టడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రజావేదికను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సచివాలయంలోని భవనాలు, 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా అని ప్రశ్నించారు.













