ఎన్టీఆర్‌కు భారతరత్న?
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారతరత్నపై కేంద్రం స్పందించింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు కేంద్రానికి విన్నివించారు. అంతేకాకుండా చట్టసభల్లోనూ తీర్మానం చేసి పంపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. తాజాగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఎంపీ కేశినేని నాని చేసిన డిమాండ్‌పై కేంద్రం స్పందించింది. భారతరత్న ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంశాఖ తెలిపింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను పీఎంవోకు పంపినట్లు నానికి హోంశాఖ సమాచారం అందించింది. కాగా, 377 నిబందన కింద ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఎంపీ కేశినేని నాని జులై 19న లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు.













