విశాఖ ఉత్తరంపై వీడిన ఉత్కంఠ
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. 1,944 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. 42వ పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్ స్లిప్పులు ఈవీఎం నెంబర్ మధ్య వ్యత్యాసం ఉండటంతో వైసీపీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. గురువారం నుంచి ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు గంటా మాట్లాడుతూ విశాఖలో నాలుగు స్థానాల్లో గెలిచి టీడీపీ బలంగా ఉందని నిరూపించామని ప్రకటించారు. తాము చేసిన సేవను గుర్తించే ప్రజలు ఓట్లు వేశారని, ప్రజా తీర్పును ఎవరైనా శిరసా వహించాల్సిందేనని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై త్వరలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని గంటా ప్రకటించారు.













