స్థానిక పోరుకు టిడిపి రె’ఢీ‘
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ అయిన వైకాపాతో అమీతుమీ తేల్చుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో సాగుతున్న ఆరాచక పాలనపై ప్రజలకు వివరించి అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. నవమాసాలు-నవమో సాలు పేరిట ప్రజా చైతన్య యాత్రలను ప్రారంభించిన తెదేపా అదే ఊపులో స్థానిక సంస్థల్లో విజయబావుట ఎగురవేసేందుకు కార్యాచరణను రూపొందించుకుంటోంది. గడచిన పదినెలలుగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడంతోపాటు, అభివృద్ధి, సంక్షేమానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్న విషయాన్ని ప్రచారం చేయాలని భావిస్తోంది.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి విజయం సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపు తోంది. ప్రధానంగా పది అంశాలతో ప్రజలను ఆకట్టుకు నేందుకు తగిన వ్యూహరచన చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోనుంది. గడిచిన 26 ఏళ్లుగా వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఉండగా ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం వైఫల్యంవల్ల 24 శాతానికి తగ్గాయని, దీంతో ఆయా వర్గా లు రాజకీయ సాధికారతను కోల్పోయారన్న విషయాన్ని బలంగా ప్రచారం చేసేందుకు నిర్ణయించింది. అంతేకాకుండా రేషన్ కార్డులు, పింఛన్ల తొలగింపు, ఇసుక మాఫియా, అమరావతి, పోలవరం, ఇళ్ళ స్థలాల పేరిట భూముల కబ్జా, జే ట్యాక్స్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీల పెంపు, నిత్యావసరా ల పెరుగుదల, పండుగ కానుకలు ఎత్తివేత, అన్న క్యాంటీన్ల మూసివేత, నిరుద్యోగ భ •తికి మంగళం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిని ఆకర్షించేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి పింఛన్లు తొలగించడం, 20 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయడం వైకాపా ప్రభుత్వ ద్రోహంగా ప్రజలకు వివరించనుంది. రాష్ట్రంలో గతంలో ఉన్న సంక్షేమ పథకాలను, పండుగ కానుకలను ఎత్తివేసి పేదల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ప్రచారానికి సిద్ధమవుతోంది. 35కు పైగా సంక్షేమ పథకాలను ఎత్తివేశారని అంతేకాకుండా నిత్యావసరాల ధరలు ఆమాంతం పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ను ప్రచార అస్త్రాలుగా సంధిచనుంది.
మరోవైపు ఎన్నికలకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పింఛన్లు ఇస్తామని ప్రకటించిన వైకాపా ఆ హామీని నిలబెట్టు కోలేదని ప్రశ్నిస్తున్న తెదేపా దీనిని కూడా స్థానిక పోరులో ఒక అస్త్రంగా సంధించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను కూడా తెదేపా ప్రచారానికి వినియోగించుకుంది. ముఖ్యంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్ళ బకాయిలు, రైతు భరోసా పేరిట బురిడీ కొట్టారని అధికారపక్షంపై తెదేపా ఇప్పటికే మండిపడుతోంది. ఈ అంశాలన్నింటిని ఎన్నికలు అస్త్రాలుగా మలుచుకొని ప్రజ లకు చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి వీకేంద్రీకరణ పేరిట వైకాపా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, అమరావతి తరలింపుపై ప్రజా రిఫరెండంకు తెదేపా సిద్ధమవుతోంది.
మూడు రాజధానుల అంశాన్ని ఆది నుంచి తెదేపా ఇదే అంశాన్ని ఒక తుగ్లక్ చర్యగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి వారి మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలలోని అన్నిమండలాలు, పంచాయతీలలో విజయం సాధించి పూర్వ వైభవం పొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపడంతోపాటు జగన్ వైఫల్యాలను ఎండగట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికితోడు చురుకైన పార్టీ నాయకులతో ప్రచారాన్ని తీవ్రం చేయాలని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలు అటు అధికారపక్షంతోపాటు ఇటు ప్రతిపక్ష టీడీపికి కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి.













