ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని వైసీపీ తుంగలో తొక్కింది : చంద్రబాబు
సిట్టింగ్ అభ్యర్థి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరిని ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని వైసీపీ తుంగలో తొక్కిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సిట్టింగ్ సభ్యుడు మరణించినప్పుడు జరిగే ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ సంప్రదాయాలు పాటించిందని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సంప్రదాయాలను పాటించడం లేదని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు ఆయన సతీమణికి మద్దతు తెలిపామని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. సెప్టెంబర్, అక్టోబర్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని నిర్ణయించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. కాగా, నంద్యాల ఉపఎన్నికల బాధ్యతలను కాల్వ శ్రీనివాసులు, సుజనా చౌదరి, నారాయణకు అప్పగించారు.













