తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన పనబాక లక్ష్మి
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేశారు. నేతలు, కార్యకర్తలతో కలిసి వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టులు చేయిస్తోందని విమర్శించారు. అప్పటికీ లొంగకపోతే వ్యాపారాలను దెబ్బతీయడం, ఎవరైనా టీడీపీ సానుభూతిపరులుగా ఉండి, వ్యాపారాలు చేసుకుంటే వాటిని ధ్వంసం చేయడంలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి సీఎం జగన్ పొగరు దించాలని, వైసీపీ మోసాలను పాలనకు నిరసనగా 22 గొర్రెలకు తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెను ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు ఒక్కరూ మాట్లాడడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













