Narendra Modi: ప్రధాని మోదీని కలిసిన టీడీపీ ఎంపీలు
కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పీఎం ఛాంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలిశారు. ఈ సందర్భంగా మోదీ విశాఖ (Visakhapatnam) లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి హాజరవడంతో అది విజయవంతమైందని గుర్తుచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కొనసాగించాలని, మరింత సహకారాన్ని అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసినందుకు ఎంపీలు అభినందనలు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల వల్ల రాష్ట్రంపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో అమెరికాతో కేంద్రం చేస్తున్న పోరుకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యే ఆక్వా, మత్స్య ఉత్పత్తులు, మిర్చి ఇతర ఆహార ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాము ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి ఎంపీలంతా ఒక్కో నియోజకవర్గంలో ఎలా విజయవంతం చేశారో తెలియజేసే పుస్తకాలను టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు ప్రధానికి అందించారు. రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) విజయనగరం ఎంపీ అప్పలనాయుడి (Appalanaidu )ని మోదీకి పరిచయం చేశారు. అప్పలనాయుడు కొత్తకొత్త విషయాలను అన్వేషిస్తారని, మంచి ఆసక్తి గల వ్యక్తి అని మోదీ కితాబిచ్చారు.







