టీడీపీ ఎంపీల ఆందోళనతో లోక్ సభ వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్‌సభను స్తంభింపచేస్తున్నారు. బుధవారం ఉదయం సభ మొదలైన వెంటనే ఎంపీల ఆందోళనతో వాయిదా పడింది. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు. పార్లమెంటు ప్రారంభానికి ముందు ఈ రోజు కూడా ఎంపీలు తమ నిరసనలు కొనసాగించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీలు నెరవేర్చాలని పార్లమెంటు ఆవరణలో నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రప్రభుత్వం వైఖరిని నిలదీశారు.













