సీఎం రమేశ్ కోరిక నెరవేరింది!
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఈ అంశాన్ని నెరవేర్చాలంటూ తాను, బీటెక్ రవి చేసిన నిరాహార దీక్షలకు రాష్ట్ర, జిల్లా ప్రజలు మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి విన్నవించినా ఆయన స్పందించలేదని విమర్శించారు. జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలకు చెందిన ప్రతిపక్ష నేతలూ హాజరవ్వాలని కోరారు. ఉక్కు కర్మాగారం అనంతరం తాను తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పిస్తానని వ్యాఖ్యానించారు. రూ.18 వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ఉక్కు కర్మాగారానికి మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె వద్ద ముఖ్యమంత్రి శంకుస్థానన చేయనున్నారు.













