ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ ఈ నాటకాలు
రాజకీయ కక్షలో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్ (వాసు)లను ఏపీ సీఐడీ అరెస్టు చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇలాగే అరెస్ట్ చేశారన్నారు. ఏ మచ్చలేని నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, వాసు. ప్రశ్నించేవారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే వారిని అరెస్ట్ చేశారు. ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు నుంచి దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతోంది. రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు.













