అక్కడ కూడా ఆయన ఊసెందుకు ? : రామ్మోహన్ నాయుడు
సీఎం జగన్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు భజన చేస్తున్నారని, అక్కడ కూడా ఆయన ఊసెందుకు? అని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలనపై వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేక అన్నీ టీడీపీపై తోసేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఢిల్లీ లో మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన వాస్తవాలు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ వచ్చి మరీ చంద్రబాబును తిట్టాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే విమానంలో వచ్చి మరి ప్రతిపక్ష నేతను తిట్టాలా? ప్రత్యేక హోదా గురించి బుగ్గన ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక్క వైసీపీ ఎంపీ అయినా అడిగారా ? అని ప్రశ్పించారు. ఎన్నికల ముందు జగన్ ప్రతి రోజూ ప్రత్యేక హోదా నామస్మరణ చేసేవారు. మూడేళ్లుగా ప్రత్యేక హోదా ఊసేలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకున్నారా? స్టీల్ ప్లాంట్‌పై నిన్న కేంద్రం జవాబిచ్చినా వైసీపీ ఎంపీలు ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు.













