పుంగనూరులో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిని మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో దుస్తులు విప్పించి అవమానించడం దారుణమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కుప్పం సైకిల్ యాత్ర చేస్తుంటే అడ్డుకోవడానికి పుంగనూరులో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అరాచకాల వెనుకున్న మంత్రి పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ దురాగతంపై ఉత్తరాంధ్ర వైసీసీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన బీసీలను అవమానిస్తే సీఎం జగన్ స్పందించరా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రులను అవమానించిన వైసీపీ నేతలు రాజధానితో ఉద్ధరిస్తామంటే ఎలా నమ్మాలి? వైసీపీ రౌడీ రాజకీయానికి భయపడే 2014 ఎన్నికల్లో విశాఖ ప్రజలు విజయమ్మను ఓడిరచారు. పెద్దిరెడ్డి కుమారుడు మిథన్ రెడ్డి పార్లమెంట్లో నన్ను అవమానించారు. ఇప్పుడు ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో అవమానించారు అని మండిపడ్డారు.













