ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష విరమణ
వాల్తేరు డివిజన్ సాధన, శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రైల్వేస్టేషన్లు విశాఖ రైల్వే జోన్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఇచ్ఛాపురంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చేపట్టిన దీక్షను బుధవారం విరమించారు. వాల్తేరు డివిజన్ సాధన పేరిట ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో ప్రారంభించిన ఈ దీక్ష 15 గంటల పాటు కొనసాగింది. బెందాళం అశోక్, విద్యార్థినులు రామ్మోహన్ నాయుడికి నిమ్మరసాన్ని ఇచ్చి దీక్షను విరమింపచేశారు. రామ్మోహన్ నాయుడితో పాటు ఇచ్ఛాపురం ఎంఎల్ఏ అశోక్ కూడా దీక్షను విరమించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లను పూర్తిస్థాయిలో నెరవేర్చుకోవడానికి ఇలాంటి పోరాట మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ మొండి వైఖరితో నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు.













