ఖాకీ డ్రెస్ వేసుకుని పబ్లిక్ కు సేవ చేయాలి..పార్టీలకు కాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ మాపియా నడుస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏం అంశంపై అయినా టీడీపీ సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని ఈ విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్ విషయంలో డీజీపీ, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తే ప్రతిపక్షానికి పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ఖాకీ డ్రెస్ వేసుకుని ప్రజలకు సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని మండిపడ్డారు. హెరాయిన్ అంశంలో వే బిల్లులు బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీని మాట్లాడద్దు అని చెప్పడానికి డీజీపీ ఎవరు అని నిలదీశారు.
వైఎస్ జగన్‌కు అన్ని క్రిమినల్ ఐడియాలని విమర్శించారు. హెరాయిన్ సుధాకర్ సొంత ఊరు ద్వారపూడి అని, అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి ఏమైనా లింక్ ఉందా అనేది విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రతో పోరాటం చేయాలని కానీ తమరు తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్‌పై తాము రాజకీయం చేయడం లేదని తమకు రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని స్పష్టం చేశారు.













