AP Liquor Scam: జగన్ హయాంలో రూ.20 వేల కోట్ల మద్యం కుంభకోణం!?
లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishnadevarayalu) సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (YS Jagan) హయాంలో రూ.20 వేల కోట్లకు పైగా విలువైన మద్యం కుంభకోణం (Liquor Scam) జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కాంను మించినంత పెద్దదని, దీని వెనుక జగన్ బంధువు సునీల్ రెడ్డి (Sunil Reddy) కీలక పాత్ర పోషించారని ఎంపీ పేర్కొన్నారు.
ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా రూ.2 వేల కోట్లను దుబాయ్‌కు తరలించినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. అంతేకాక, వైసీపీ పాలనలో రూ.20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు గోప్యంగా జరిగాయని, ఈ వ్యవహారంలో జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని నియంత్రించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఈ కుంభకోణంలో Adan, Graysons, Leela, JR Associates, PV Spirits వంటి 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయని, ఈ సంస్థలు వైసీపీ అనుబంధ వ్యాపారులకు అనుకూలంగా పనిచేశాయని ఎంపీ తెలిపారు. జగన్ పాలనలో ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టినట్లు ఆయన ఆరోపించారు. అంతేకాదు, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి డిస్టిలరీలను బలవంతంగా తీసుకుని, బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
“లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనత జగన్‌రెడ్డిది. తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి, రూ.వేల కోట్లు అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు వెళ్లేలా చేశారు,” అని లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీ నుంచి ఇంతవరకు ఈ ఆరోపణలపై స్పందన రాలేదు. ఈ విషయంపై మరింత విచారణ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













