ఉప ఎన్నికలు రావని తెలిసే రాజీనామా
ఉప ఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని తెలుగుదేశం ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. విజయవాడలో ఆయన ఎంపీ కేశినేని నానితో కలిసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలని విమర్శించారు. బీజేపీతో వైసీపీ కుమ్మక్కైందని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడాలని జగన్ ఆరాటపడుతున్నారన్నారు. హోదా కోసం 2016లోనే రాజీనామాలు చేసి ఉంటే బాగుండేదని సూచించారు. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదని, వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందవని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతోంది టీడీపీనే అని సృష్టం చేశారు. పార్లమెంట్లో మాట్లాడకుండా తమ గొంతు నొక్కారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలపై జగన్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో జగన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు ఓ పక్క రాజీనామాలు చేసినట్లు చెబుతూనే, మరోపక్క వాటిని ఆమోదించకుండా కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుపై బురద జల్లేందుకు జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నుంచి సహకారం లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో తీసుకెళ్తున్న చంద్రబాబుకు సహకరించాల్సిపోయి, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమ పదవులకు రాజీనామా చేశామని చెప్పుకుంటున్న వైసీపీ ఎంపీలు జీతభత్యాలు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు.













