ఏపీ నుంచి కేంద్రానికి ఎక్కువ… కేంద్రం నుంచి ఎపీకి తక్కువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎక్కువ నిధులు వెళుతున్నాయని, కేంద్రం నుంచి రాష్ట్రానికి తక్కువ నిధులు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడతూ దేశ చరిత్రలో లోక్‌సభ స్పీకర్‌ను ఘోరావ్ చేయడం, ప్రధాని ఇంటిని ముట్టడించింది టీడీపీయే అని అన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు పెద్ద డ్రామా అని, కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు, దీక్షలను ప్రజలు నమ్మడం లేదన్నారు. పోరాటం అంటే తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయికి తీసుకెల్లింది చంద్రబాబే అని పేర్కొన్నారు. మోదీ రాజకీయానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు టీడీపీ పోరాటం చేస్తుందని సృష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణను సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటున్నారు, రాష్ట్రంలో కాలు దువుతున్నారని ధ్వజమెత్తారు. తమ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఢిల్లీలో ఎవరు మాట్లాడుతారని ప్రశ్నించారు.













