ఏపీకి అన్ని అర్హతలు ఉన్నాయి : కేశినేని
ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి వ్యతిరేకంగా అమిత్ షా-మోదీ అనేక కుటిల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు తమ పార్టీ సమ దూరంలో ఉందని తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎన్డీఏలో భాగమైన శివసేన, శిరోమణి అకాలీ దళ్ వంటి పార్టీలు కూడా మోదీకి అండగా నిలవలేదన్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకే న్యాయం జరిగిందని, ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. వైసీపీ ట్రాపులో టీడీపీ పడలేదని, జగన్-గాలి జనార్దన్‌రెడ్డి వలలో మోదీనే పడ్డారని విమర్శించారు. మోదీ దేశ ప్రధానిగా ఉండే అర్హతను కోల్పొయారని విమర్శించారు. ప్రధాని పదవిలో ఉన్న వారు హుందాగా ఉండాలని కానీ మోదీ ప్రవర్తన ఆ స్థాయిలో లేదని మండిపడ్డారు. ప్రధాని తన స్థాయి మరిచి ఆ పదవికే మచ్చ తెచ్చారని, దేశ ప్రజల్లో ఆయనపై ఉన్న అభిప్రాయాన్నే తాను చెప్పానని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశమంతటి దృష్టికి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ విజయవంతమయ్యిందన్నారు.













