కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : టీడీపీ
జమ్మూకశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సృష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో మాట్లాడారు. జమ్ముకశ్మీర్ ప్రజలు సంతోషంగా జీవించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన హక్కులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఆరు దశాబ్దాలుగా కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ విభజనకు సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రవీంద్రకుమార్ అభినందనలు తెలిపారు. ఈ అంశంలో కేంద్రానికి టీడీపీ మద్దతిస్తుందని తెలిపారు.













