వారికి ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత
ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా సీఎం జగన్ మాట్లాడారని అమరావతి రైతులకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టం ముసుగులో ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు చేసే పనులకు పొంతన లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతిని అభ్యంతరం లేదని చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చి మడమ తిప్పారని ధ్వజమెత్తారు.
కులాలు, ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆక్షేపించారు. రైతుల పాదయాక్రు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. కొంత మంది శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఆదాయం పెరిగింది. అప్పులు రెండు రేట్లు పెరిగాయి. ప్రాజెక్టులు అగిపోయాయి. తెచ్చిన డబ్బులకు లెక్కలే లేవని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తుందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అవినీతి లేదనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడున్నరేళ్లుగా ఆర్థిక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదన్నారు. ఆదాయం, అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.













