సీఎం చంద్రబాబుతో జేసీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాజీనామా వంటి ప్రకటనలపైనా చంద్రబాబు జేసీకి కాస్త గట్టిగానే హితబోధ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వదిలి అమరావతిలో తిరుగుతున్నారేంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ, అంతా సమసిపోయిందని, తాను పార్లమెంట్‌కు హాజరవుతున్నానని తెలిపారు. మోదీ ప్రధాని ఉన్నంత వరకు విభజన హామీలు అమలు కావని, అయినా పోరాటం కొనసాగాల్సిందేనని అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టిమాటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ, మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం విడ్డూరమని అన్నారు. రాజకీయాలు ఎక్కడా బాగాలేదని, రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదని అన్నారు. సీఎంతో భేటీ విషయంలో తానేమీ మాట్లాడనంటూ హస్తినకు పయనమయ్యారు.













