తమ పార్టీ నిరంతరం పోరాటం : గల్లా
రాష్ట్ర విభజన హామీల సాధనకు తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. పార్లమెంటు లోపల, బయటా తెలుగుదేశం ఎంపీలంతా ఆందోళన కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలను అమలుచేయడం విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి లోక్సభలో నోటీసులు ఇస్తున్నా సభాపతి సుమిత్రా మహాజన్ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లులు వంటి కీలక బిల్లులను అరగంటలోనే ఆమోదించారని గుర్తు చేశారు. సభలో చూడలేను, వినలేనంటున్నారు, ఇకపై మాట్లాడలేనంటారేమో అని సభాపతి వైఖరిపై స్పందించారు. స్వతంత్య్రంగా వ్యవహరించకుండా సభాపతి కేంద్రం చెప్పినట్టే చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యం లేవని సభాపతి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జనసేన, వైకాపా నేతలు టీడీపీను రాజకీయ లబ్దికోసమే నిందిస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో వాస్తవంగా పోరాటం చేస్తున్నదెవరో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. జనసేన, వైకాపా నేతలకు రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. ఈ సమావేశాల్లో కేంద్రం స్పందించకపోతే న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.













