పరిశ్రమ కోసం ప్రాణం పోయినా లెక్కచేయను
ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప జడ్పీ కార్యాలయం ఆవరణలో ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీక్షలో ఉన్న ఎంపీ రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవికి రిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారి షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇద్దరూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీక్షా శిబిరంలోనే సీఎం రమేష్ వెంట ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యం క్షీణించినా దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణం పోయినా లెక్క చేయనని సృష్టం చేశారు. విభజన హామీలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. ప్రజల సహకారంతో దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. మంత్రులు సొమిరెడ్డి, కళా వెంకట్రావు, అచ్చెన్న నాయుడు, ఆదినారాయణరెడ్డి, పితాని దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు.













