ప్రధాని మోదీకి టీడీపీ ఎంపీ అపురూప కానుక
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీ లఘు చిత్రాన్ని ఓ చేనేత కుటుంబానికి చెందిన దంపతులతో ప్రత్యేకంగా నేయించారు. ఈ కానుకను ప్రధానికి స్వయంగా అందజేశారు. ఎంపీ అప్పలనాయుడు సూచన మేరకు ఈ చిత్రాన్ని విజయనగరం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం లావేరు మండలానికి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు జూన్ మొదటి వారం నుంచి 40 రోజుల పాటు శ్రమించి పూర్తి చేశారు. మూడు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవు కలిగిన చేనేత వస్త్రంపై మోదీ చిత్రాన్ని తీర్చిదిద్దారు. బుధవారం స్వీయంగా ఎంపీ అప్పలనాయుడు మోదీకి ఈ చిత్రపటాన్ని అందజేయగా, ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ కానుక అందుకోవడం ఓ తీయని జ్ఞాపకంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు.













