ఇలాగైతే సత్య నాదెళ్లలు ఎలా వస్తారు ?
పాఠశాల మొదలు విశ్వవిద్యాలయం వరకు పెద్ద ఎత్తున బోధన సిబ్బంది కొరత ఉందని, ఇలాగైతే సీఎం జగన్ చెబుతున్నట్టు సత్య నాదెళ్లలు ఎలా తయారవుతారని టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌లు విజయవాడలో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీలు వెల్లడిరచారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని నాలుగేళ్లలో పెద్ద ఎత్తున ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షనేతగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్ని జగన్ నెరవేర్చాలని అన్నారు. గ్రూప్`2, 3, 4 సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్న పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో 70 శాతానికి పైగా బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లో వెనకబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.













