వారికి లేని నిబంధనలు ఆంధ్ర రాష్ట్రానికే వర్తిస్తాయా ?
కేంద్ర ప్రభుత్వం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తోందని, ఇందుకు జాతీయ నాయకులు అఖిలేష్ యాదవ్, శరద్‌పవార్, మమతా బెనర్జీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్నా బీజేపీ, వైసీపీ నాయకులు అపహాస్యం చేశారని, దేశవ్యాప్తంగా జరిగిన మూడవ విడత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటువేసినా బీజేపీకి పడుతోందని జాతీయ నాయకులు పేర్కొనడం బాబు ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోందన్నారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేర్లు వాడితే వచ్చే నష్టమేంటని ఎన్నికల కమిషన్‌కు ప్రశ్నించారు. దేశమంతా ఒకే విధంగా ఎన్నికల నిబంధనలు ఉండాలని, అయితే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని, వారికి లేని నిబంధనలు ఆంధ్ర రాష్ట్రానికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏమీ ప్రత్యేక దేశం కాదని, అక్కడ సమీక్షలు జరిపితే స్పందించని ఈసీ ఇక్కడ సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలపై సమీక్షలు చేస్తే ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల నిబంధనలు దేశమంతా ఒకేలా ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు సమీక్షలు చేయకూడదో ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు, కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాల వల్ల 17 మంది విద్యార్థులు చనిపోతే కుహనా మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, సినిమా నటులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.













