TDP MLC Candidates : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా..!?
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLA quota MLC Elections) నోటిఫికేషన్ రావడంతో అందరి దృష్టీ అటువైపు మళ్లింది. కూటమి తరపున ఎవరు పోటీ చేస్తారు.. ఎవరెవరికి అవకాశం లభిస్తుంది అని ఆరా తీస్తున్నారు. ఆశావహులందరూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారా.. లేకుంటే కులాల లెక్కలు, ఆర్థిక అండదండలను పరిగణనలోకి తీసుకుంటారా.. అనే అంశంపై క్లారిటీ లేదు. అయితే నాలుగు సీట్లనూ టీడీపీ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక దాన్ని జనసేనకు (Janasena) కేటాయించారు. ఆ పార్టీ తరపున నాగబాబు (Nagababu) పోటీ చేయడం ఖరారైంది. ఆ తర్వాత ఆయన్ను మంత్రివర్గంలోకి కూడా తీసుకోబోతున్నారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని సమాచారం. బీజేపీకి ఈ దఫా ఎమ్మెల్సీ అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. మలి విడత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి (BJP) ఒక సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆశావహుల సంఖ్య భారీగా ఉండడం, సీట్లు త్యాగం చేసిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ కూడా సుముఖత వ్యక్తం చేసింది.
టీడీపీ తరపున సీట్లు ఆశిస్తున్న వాళ్ల సంఖ్య భారీగా ఉంది. ఇప్పడు పదవీ విరమణ చేస్తున్న వారిలో యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు ఉన్నారు. వీళ్లలో కొంతమంది తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీళ్లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగాలు చేసిన వాళ్లకే చంద్రబాబు మొదటి ప్రయారిటీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న వాళ్లలో పిఠాపురం వర్మ, వంగవీటి రాధా, దేవినేని ఉమా మహేశ్వర రావు ముందున్నారు. వీళ్ల ముగ్గురికి సీట్లు ఖాయమని కూడా తెలుస్తోంది. పిఠాపురం వర్మ (Pithapuram Varma) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోసం సీటు త్యాగం చేశారు. అలాగే దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao) వసంత కృష్ణప్రసాదుకోసం సీటు వదులుకున్నారు. పైగా ఎక్కడా అసంతృప్తి తెలపకుండా పార్టీ ఆదేశాల మేరకు వీళ్లిద్దరూ పని చేస్తున్నారు. అలాగే కాపు సామాజికవర్గంలో బలమైన పట్టున్న వంగవీటి రాధా (Vangaveeti Radha) కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించకుండా ప్రచారం చేశారు. దీంతో ఆయనకు ఈసారి సీటు పక్కా అని తెలుస్తోంది.
ఇక మిగిలిన ఒక స్థానాన్ని మోపిదేవి వెంకటరమణకు (Mopidevi Venkata Ramana) ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని వైసీపీ నుంచి వచ్చేశారు. పైగా మళ్లీ రాజ్యసభకు వెళ్లే ఉద్దేశం లేదని, రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నానని చెప్పారు. పైగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కూడా మోపిదేవికి కలిసొచ్చే అంశం. ఒకవేళ బీసీలకు ఇవ్వాలనుకుంటే దేవినేని స్థానంలో బీద రవిచంద్ర యాదవ్ ను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. లేదంటే ఒక మైనారిటీ నేతను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అంచనా.. 8వ తేదీన అభ్యర్థులను ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.













