ఎమ్మెల్సీ పదవికి బీటెక్ రవి రాజీనామా
పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు), సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. పాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. చట్టసభ అయిన శాసనమండలికి ప్రాధాన్యత దక్కకపోవడంపై కలత చెంది, అలాంటి మండలిలో ఉండటం అనవసరమని భావించి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మండలి చైర్మన్‌కు ఫార్మెట్లో తన రాజీనామాను పంపుతానని చెప్పారు.













