మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. సభలో నిరూపిస్తాం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చరిత్రలోనే ఈరోజు చీకటి రోజు అని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సారా మరణాలను సహజ మరణాలని సీఎం ప్రకటించారని, దీనిపై చర్చ జరగాలని కోరామన్నారు. మార్షల్స్ సభలోకి వచ్చి తమకు అడ్డుగా నిల్చుకున్నారని తెలిపారు. సభలో లేని బీజేపీ సభ్యుడు వాకాటా నారాయణ రెడ్డిని కూడా తమ లిస్ట్‌లో చేర్చారని మండిపడ్డారు. మార్షల్స్ అడ్డుపెట్టి తమ గొంతు నొక్కారన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే రేపు చర్చకు సిద్ధమా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సభలో నిరూపిస్తాము. మా నిరసన తెలపడానికే చిడతలు వాయించాము అంటూ స్పష్టం చేశారు. వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమమీద 500 రూపాయల నోటు విసిరారని మండిపడ్డారు. 42 సహజ మరణాలు అతనికి ఎలా కనబడుతోందని ప్రశ్నించారు. ఇది క్లబ్ అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కనీసం చైర్మన్ కూడా మందలించలేదని, మండలి చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.













