పరారీలో టీడీపీ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు..
దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీ లో ఉన్నట్లు ఏలూరు జిల్లా నూజివీడు డీఎస్పీ శుక్రవారం సాయంత్రం విలేకరులకు తెలియపరిచారు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్ సందర్భంగా పెదవేగి మండలం కొప్పుల వారి గూడెంలో హత్యాయత్నం ఘటనలో నిందితుడిగా తాళ్లూరి రాజశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని భారీ సంఖ్యలో అనుచరులను వేసుకొని పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేశారు. స్టేషన్లో ఎస్సై విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా లాకప్ లో ఉన్న నిందితుడిని బలవంతంగా తీసుకొని వెళ్లారు. దీంతో పోలీసులు అతనితో పాటు అతని వెంట వచ్చిన 14 మంది అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న డిఎస్పీ లక్ష్మయ్య నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. భారీగా గాలింపు చర్యలు చేపట్టి 24 గంటల వ్యవధిలో రాజశేఖర్ ను తిరిగి పట్టుకొని కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి అతనికి జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించారు. శని, ఆదివారాల సమయం కావడంతో బెయిల్ దొరికే అవకాశం ఉండదు అని తెలుసుకున్న చింతమనేని రాష్ట్రం వదిలి పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు. యాంటిసిపేటరీ బెయిల్ దొరికిన తరువాతే అతను తిరిగి బయటకు వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో చింతమనేనికి బెయిల్ దొరికే అవకాశం చాలా తక్కువ అని పోలీసులు భావిస్తున్నారు.













