ఆ పదవి నాకొద్దు!
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆమె లేఖ రాశారు. టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నన్ను నియమించినందుకు మీకు కృతజ్ఞతలు. నా ఇష్ట దైవమైన వెంకటేశ్వరస్వామికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు. నేను హిందూ మతస్థురాలిని. ఎస్సీని. వెంకటేశ్వరస్వామికి భక్తురాలిని. అనేకసార్లు తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నా, కొందరు తమ వ్యక్తిగత అజెండాతో నా నియామకంపై వివాదం సృష్టించి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా మూలంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలగడం నాకిష్టం లేదు. అందుకే నా నియామకాన్ని ఉపసంహరించగలరు అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.













