అలా ముందుకొచ్చిన వారికి.. తాను అండగా ఉంటాను : చంద్రబాబు
వైసీపీ అరాచక పాలనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకునేందుకు అందరూ కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయపడితే మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతింటామని, పోరాటాన్ని ఆయుధంగా మార్చుకోవాలని సూచించారు. అలా ముందుకొచ్చిన వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సమాజహితం కోసం టీడీపీ అవసరముందని, అందుకే విరాళాలు సేకరిస్తున్నామన్నారు. పార్టీకి విరాళాలు వస్తే కొందమందికైనా సాయం చేయొచ్చున్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ మాయ చేసే నేతలకు చెక్ పెడతానన్నారు. పనిచేసే వారెవరో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చిందన్నారు. సీనియార్టీని గౌరవిస్తాం సిన్సియార్టీని గుర్తిస్తామన్నారు. సీనియార్టీ ఉన్నా ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభం? ఓటు వేయించలేని సీనియర్లకే ప్రాధన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం. 40 శాతం యువత సీట్లీద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. తటస్థులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో పనిచేసే యువత నేతలనూ గుర్తిస్తాం, వారికీ అవకాశాలిస్తాం అని అన్నారు.













