వ్యవసాయ అనుబంధాలకు అగ్రస్థానం
తెలుగుదేశం మేనిఫెస్టో కమిటీ సమావేశం
వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో -2019 కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ఊతమిచ్చే పాడిపరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందించాలని మేనిఫెస్టో సన్నాహక సమావేశం అభిప్రాయపడింది. వచ్చే ఎన్నికల ప్రణాళికలో ఏఏ అంశాలను చేర్చాలనే విషయంపై ఏడుగురు మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ ముఖ్యులతో కూడిన కమిటీ సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో సమావేశమై ప్రాథమిక రంగంపై చర్చించింది.
ఆగ్రో పరిశ్రమలకు అగ్ర ప్రాధాన్యమివ్వాలని సమావేశంలో పలువురు ప్రతిపాదించారు. డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉందని సమావేశంలో పాల్గొన్న ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రాష్ట్ర రైతాంగం క్రమంగా పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం వైపు మళ్లుతోందని, తగిన ప్రోత్సాహం కల్పిస్తే యువతరం కూడా సహజ వ్యవసాయంపై దృష్టి పెడుతుందని పలువురు చెప్పారు.
మేనిఫెస్టో కమిటీ తదుపరి సమావేశం ఈనెల 28న జలవనరుల రంగంపై నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎన్.ఎం.డి ఫరూఖ్, నక్కా ఆనంద్ బాబు, కిడారి శ్రవణ్, ఎంపీ సీతామహాలక్ష్మి, ఎమ్మెల్యేలు వాకపల్లి గణేశ్, నిమ్మల రామానాయుడు, భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బీద రవిచంద్ర, బచ్చుల అర్జునుడు, తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి పంచుమర్తి అనూరాధ, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మీడియా, కమ్యూనికేషన్స్ సమన్వయకర్త పి. కృష్ణయ్య, చిన్నమనాయుడు, నామన రాంబాబు పాల్గొన్నారు.













