ఈసారి ఒక్కరోజే టీడీపీ మహానాడు…ఎందుకో తెలుసా?
తెలుగుదేశం పార్టీ మహానాడును ఈసారి ఒంగోలు లో మే 28న ఒక్కరోజే నిర్వహించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్య నేతల బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయనుంది. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడును ఏటా మే 27నుంచి 29 వరకు నిర్వహించడం ఆనవాయితీ. ఒంగోలు ప్రాంతంలో నీటి ఎద్దడి, ఎండల తీవ్రత దృష్ట్యా ఈసారి ఒక్కరోజుకే పరిమితం చేయాలని నిర్ణయించారు.
మే 27న 4-5 వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 28న మహానాడుకు ఎవరైనా హాజరు కావొచ్చు. ఆ రోజు భారీ బహిరంగ సభలోనే ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని ప్రారంభిస్తారు. ఏడాది పాటు కొనసాగిస్తారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఆన్లైన్లో నమోదు వాట్సప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ల ద్వారా సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం ఉన్నవారు పునరుద్ధరించుకోవచ్చు.













