చురుగ్గా మహానాడు ఏర్పాట్లు
విజయవాడ వేదికగా ఈ నెల 27,28,29 తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు భూమిపూజతో మహానాడు పనులు ప్రారంభమయ్యాయి. ఈ మహానాడును తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే 14 కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాజకీయ తీర్మానాలను కూడా సిద్ధం చేశారు. ఏర్పాట్లు పురోగతిని అన్ని కమిటీల అధ్యక్షులు ఎప్పటికప్పుడు అధినేతకు వివరిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఏర్పాట్లకు సంబంధించిన నివేదికలను అధినేత దృష్టికి తీసుకువెళుతున్నారు. మహానాడు కార్యక్రమానికి సంబంధించి రెండు రాష్ట్రాల నుంచి 35 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. విజయవాడ వేదిక కావడంతో అటు తెలంగాణతో పాటు ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు అత్యధికంగా తరలివచ్చే అవకాశాలున్నాయి.
ఎన్నికల ఏడాది కావడంతో జనసమీకరణపై తెలుగుదేశం అధిష్ఠానం దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో మినీ మహానాడులు విజయవంతంగా జరుగుతున్నాయి. ఇదే ఊపులో జాతీయ మహానాడును కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నిర్దేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పార్టీ భవిష్యత్ కార్యచరణను ఆయన మహానాడు వేదికగా నిర్దేశించనున్నారు.













