ఇది…సాంకేతిక…మహానాడు…
-నేటి నుంచి 2 రోజుల పాటు ఆన్లైన్ సందడి…
-జూమ్ ద్వారా పాల్గొంటున్న వేలాది మంది…
-దేశంలో ఇదే మొదటి వర్చువల్ పార్టీ ఫెస్ట్…
తెదేపా పార్టీకి సంబంధించి పెద్ద పండుగగా ఆ పార్టీ పరిగణించే ‘మహానాడు’ తొలిసారి పూర్తి సాంకేతిక సంబరంగా జరుగనుంది. బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్న ఈ మహానాడును కరోనా వ్యాప్తి నేపధ్యంలో పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ‘వర్చువల్ మహానాడు’ జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్ యాప్ ద్వారా భాగస్వాములవుతున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ… ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్లైన్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మెదటి సారి.
మే 28న ఎన్టీఆర్ జయంతి కలసి వచ్చేలా, ఏటా మూడు రోజులపాటు అత్యంత కోలాహలంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా వల్ల ఈసారి… పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి ఇళ్ల నుంచే మహానాడులో పాల్గొంటున్నారు.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు కళావెంకటరావు సహా, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు మాత్రం మంగళగిరి సమీపంలోని పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ‘మహానాడు’లో పాల్గొంటారు. మిగిలిన నేతలంతా జూమ్ యాప్ ద్వారా భాగస్వాములవుతారు.
రెండు రోజుల కార్యక్రమాలు..
* కరోనా నేపథ్యంలో మహానాడును ఈసారి రెండు రోజులకే కుదించారు.
* పార్టీ జాతీయ కార్యాలయంలోని సమావేశమందిరంలో చంద్రబాబు సహా ముఖ్యనేతలు భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటారు. ప్రత్యేకంగా వేదికంటూ ఉండదు.
* బుధవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
* మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో మృతి చెందినవారికి సంతాపం ప్రకటిస్తారు.
* తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, ఏపీ అధ్యక్షుడు కళావెంకటరావు ప్రసంగిస్తారు.
* 12 గంటల నుంచి 12.25 వరకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు.
* 12.25 నుంచి ఒంటి గంట వరకు తీర్మానాలు ప్రవేశపెడతారు.
* భోజన విరామానంతరం మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
* గురువారం రెండోరోజు ఎన్టీఆర్ జయంతి వేడుకలతో మొదలవుతుంది.
* ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 వరకు వివిధ తీర్మానాలు ప్రవేశపెడతారు.
* భోజన విరామం తర్వాత మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
* రాజకీయ, సంస్థాగత తీర్మానాలతో పాటు, ఇతర తీర్మానాలు ప్రవేశపెడతారు.
* సాయంత్రం 5.05 నుంచి 5.30 వరకు చంద్రబాబు ఉపన్యాసంతో కార్యక్రమం ముగుస్తుంది.













