ఘనంగా మహానాడుకు ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ నలభై వసంతాలు, నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల వేడుక సందర్బంగా ప్రారంభం కానున్నా మహానాడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు మండలంలోని మండువవారిపాలెం ఎన్నో ప్రత్యేకతలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని వేదికను 80 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవుతో తీర్చిదిద్దారు. మూడు లక్షలమందికి పైగా వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఓ వైపు 40 అడుగుల ఎత్తైన డిజిటల్ కటౌట్ అమర్చి, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు తదితర నాయకుల చిత్రాలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణానికి ఎడమ వైపున కావుల పక్కన 53 ఎకరాల సువిశాల స్థలంలో 10,000 వాహనాలు, గ్యాలరీకి వెనుక వైపు వీఐపీల వాహనాలు 2,000 వరకు పార్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు తదితరుల ఆధ్వర్యంలో దాదాపు 500 మంది వాలంటీర్లు సేవలకు సిద్ధమయ్యారు. అతిథులకు నీళ్లు, మజ్జిగ, అల్పాహారం వంటివి అందజేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచచి మరో 1500 మంది రానున్నారు. మూడేళ్ల విరామం తరువాత కార్యకర్తల నడుమ నిర్వహిస్తున్న వేడుక కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా వంటకాలు సిద్ధం చేస్తున్నారు.













