వరుస కేసులతో టీడీపీ నేతల ఉక్కిరిబిక్కిరి!
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంపార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఏమాత్రం మింగుడు పడట్లేదు. తాజా పరిషత్ ఎన్నికలను ఏకంగా బహిష్కరించింది. దీంతో సమరానికి వెళ్లకముందే చేతులెత్తేసిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే తిరుపతి బైపోల్ ను మాత్రం ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. చివరిక్షణం వరకూ పోరాడింది. అయితే.. ఆ పార్టీ నేతలకు ఇప్పుడు వరుస కేసులు తీవ్ర ఇబ్బందిగా మారాయి.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పైనే సీఐడీ కేసులు బుక్ చేసింది. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కేసుల ఉచ్చులో ఉన్నారు. దీంతో ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఏకంగా అగ్రనేతలపై నమోదవుతున్న కేసులతో కింది స్థాయి కేడర్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంకెంతమందిపై కేసులు నమోదవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
తిరుపతి ఉపఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలతూటాలు పేలాయి. ప్రచారంలో భాగంగా ఈ నెల 7న మాజీ మంత్రి దేవినేని ఉమ ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో సీఎం జగన్ మాట్లాడినట్లుగా చెప్పిన ఓ వీడియోను జగన్ మీడియాకు చూపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ అది మార్ఫింగ్ చేసిన వీడియో అని తేల్చింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత దేవినేని ఉమ మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించారని.. ఆయనపై చర్యలు తీసకోవాలని కంప్లెయింట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ.. దేవినేని ఉమకు నోటీసులు అందించింది. గురువారం ఉదయం 10గంటల 20 నిమిషాలకు విజయవాడ గొల్లపూడిలోని ఉమ నివాసానికి నోటీసులు అంటించి.. పదిన్నర గంటలకు కర్నూలులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో అవమానించారంటూ వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు చంద్రబాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇక.. శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్‌ను వరుస కేసులు వేధిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం డ్యూటీలో ఉన్న డీఎస్పీని దూషించారంటూ పోలీసులు కేసు ఫైల్ చేశారు. దీంతో ఆయన అజ్ఞాతంలో ఉండి.. తాజాగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. అంతకుముందు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపైన కూడా కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటివరకూ పదికి పైగా కేసులు నమోదయ్యాయి.
టీడీపీ నేతలు, కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదవడాన్ని ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. చేయని తప్పులకు తమ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని నారా లోకేశ్ విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి, అరెస్టు చేసి జగన్ ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి.. జాంబిరెడ్డిలాగా మారిపోయారని ఘాటుగా విమర్శించారు. జగన్ 22నెలల పాలనలో 25 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు.
అయితే.. పార్టీ కిందిస్థాయి కేడర్ మాత్రం కేసులు, అరెస్టులపై తీవ్ర ఆందోళన చెందుతోంది. అగ్రనాయకత్వం ఎంత భరోసా ఇస్తున్నా క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం కేసులంటనే వణికిపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చాలా మంది గ్రామ, మండలస్థాయి కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఇక సోషల్ మీడియాలో పెడ్తున్న పోస్టులపై ప్రభుత్వం, వైసీపీ గట్టి నిఘా పెట్టింది. దీంతో సోషల్ మీడియా వాలంటీర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. మరి ఈ కేసుల పరంపర ఎప్పుడు ఆగుతుందో.. ఎప్పుడు బయటపడతామోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.













