ఫిరాయింపులతో తెదేపాలో వేడెక్కిన రాజకీయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు త్వరలో జరగనుండటంతో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. కొంతమంది నాయకులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. గెలుపు, అధికారమే పరమావధి అనుకునే నాయకులు ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియదు. తాము పార్టీలో ఉండే వరకు ఆ పార్టీని తెగపొగిడిన నేతలు కప్పదాటు వేయగానే విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం పరిపాటి. నిన్నటి వరకు అధికార పార్టీవైపు చూపులు చూసిన నేతలు నేడు ప్రతిపక్ష వైకాపాలోకి జంప్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వైకాపాలో చేరగా తాజాగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిపోయారు. విశాఖజిల్లా అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు.
హైదరాబాద్లో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుని, తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. ఇదే కోవలో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది, అలాగే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం వీడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంటే మరి కొందరు జనసేన వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఎవరూ ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
తెలుగుదేశం పార్టీ వీడతారనే ప్రచారంలో ఉన్న నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకవైపు బుజ్జిగిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది. ఇదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్లేవారితో సంప్రదింపులు చేసే ప్రసక్తి లేదని, వారి వల్ల పార్టీకి ఎటువంటి నష్టం ఉండకపోగా మేలు చేకూరుతుందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మరోవైపు విశాఖ జిల్లాలో మాజీ ఎంపీలు కొణతాల రామకష్ణ, సబ్బం హరిలు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో ఒకరికి అనకాపల్లి ఎంపి సీటు కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అవంతి ఫిరాయింపును చంద్రబాబు సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తున్నది. పైగా కొందరు తెదేపా నేతలకు వచ్చే ఎన్నికలలో టికెట్లు దక్కే అవకాశాలు లేవని అధిష్టానం కరాఖండిగా చెప్పడంతో ఫిరాయింపులకు ఆస్కారం ఏర్పడింది. కొందరి వైఖరిపై గుర్రుగా వున్న అధిష్టానం వారు పార్టీని ఎప్పుడు వీడిపోతారా అని ఎదురుచూస్తోందనే ప్రచారం కూడా వుంది.













