చైనా, యూరప్‌తో ఏపీని పోలుస్తారా? : పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై ప్రధానికి రాసిన లేఖలో చైనా, యూరప్‌తో ఏపీని పోలుస్తారా? అని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సీఎం వైఎస్ జగన్ కారణమని అన్నారు. రాష్ట్రం సమస్యను ఇతర దేశాలతో పోలుస్తారా అని ప్రశ్నించారు. విద్యుత్ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణలో పోల్చుకోలేదని అన్నారు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉంటే చైనా సమస్య జగన్‌కు ఎందుకు? అని ప్రశ్నించారు.
విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణ లోటులో ఉందన్నారు. విద్యుత్ విషయంలో ఇప్పుడు తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. వర్షాకాలంలో రిజర్వాయర్లు నిండిన సమయంలో విద్యుత్ కోతలా? అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల దివాళకు కారణం వైఎస్ జగన్ ప్రభుత్వ కక్ష సాధింపే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకానికి ప్రధానిని బాధ్యుణ్ని చేయొద్దు అని అన్నారు. ప్రధానికి లేఖ రాసి బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదన్నారు. ట్రు అప్ పేరుతో ఛార్జీల భారాన్ని ప్రజలు భరించాలా? అన్నారు. ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం ఎందుకు మోపుతున్నారు అని ప్రశ్నించారు.













