బీజేపీ నిర్వహించేది ప్రజాగ్రహ సభ కాదు.. జగన్ అనుగ్రహ సభ
విజయవాడలో బీజేపీ నిర్వహించేది ప్రజాగ్రహ సభ కాదని, జగన్ అనుగ్రహ సభ అంటే బాగుండేదని టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలు కొనసాగిస్తూన్నా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం నోరెత్తడం లేదని ఆరోపించారు. బీజేపీకి బ్రాండ్‌గా ఉన్న హిందుత్వ అంశాలపైనా మౌనంగా ఉన్నారని, ఆలయాలపై దాడులు జరిగినా ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదని ఆక్షేపించారు.
అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చి చెబితేనే మేలుకొన్నారు. పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చి దాడులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రజలకోసం కాకుండా ప్రభుత్వం కోసం పనిచేసేరకంగా తయారైందన్నారు. దేశం మొత్తంపై ఉన్న బీజేపీ మోదీ, అమిత్ షా నెట్‌వర్క్‌లో పనిచేస్తుంటే, ఏపీ బీజేపీ మాత్రం జగన్ నెట్‌వర్క్‌లో పనిచేస్తోందన్నారు. కేంద్ర నిధులు దారిమళ్లిస్తుంటే ఇక్కడ బీజేపీ నేతలకు ఏమాత్రం పట్టలేదన్నారు.













