అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డ జగన్.. దేవినేని ఉమ
ఎన్నికలకు ముందుగానే జగన్ సర్కార్ విలువైన భూములన్నిటిని ప్రైవేటు కంపెనీల ఖాతాలోకి మార్చేస్తోంది అని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. జగన్ నేతృత్వంలో భారీ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నాయని ఆయన అన్నారు.పెద్ద పెద్ద కంపెనీలను వెళ్ళగొట్టి యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం వేధింపులు భరించలేక ఎన్నో కంపెనీలు ఆంధ్రాని వదిలి వెళ్ళిపోయాయని.. ఇదేనా వీళ్ళ ప్రగతి అని ఎద్దేవా చేశారు. పనికొచ్చే కంపెనీలను తరిమి కొట్టి.. అస్మదీయ కంపెనీలకు మాత్రం అడ్డదిడ్డంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. విలువైన ప్రభుత్వ భూములను అతి స్వల్ప ధరకు లీజుకు ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ఒక్క రోజు ముందు ఇటువంటి ఒప్పందం జగన్ కుదుర్చుకున్నారని.. ఒక్క కంపెనీ కు జగన్ ఐదేళ్ల పాలనలో సుమారు 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని ఉమ ఆరోపించారు. ఇండోసోల్ అనే కంపెనీకి ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు రోజు 17వేల ఎకరాలను ఏడాదికి 31 వేలు రూపాయల చొప్పున లీజుకు ఇచ్చినట్టు ఉమ పేర్కొన్నారు. ప్రజా ధనం కొల్లగొట్టి అడ్డ దారిలో సంపాదించడానికి జగన్ అలవాటు పడిపోయాడు అని ఉమా ఎద్దేవా చేశారు.













