త్వరలోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన : చింతమనేని
ఎవరి డిమాండ్‌పై మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు జ్ఞానోదయం అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి, తుళ్లూరు, మందడం రైతులు చేస్తున్న దీక్షలకు చింతమనేనితో పాటు దెందులూరు నుంచి తరలివచ్చిన రైతులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అందరినీ భూ సమీకరణకు ఒప్పించి రాజధానిపై అప్పటి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేస్తే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. వైకాపా పాలనలో రాజధాని రైతులు మాత్రమే కన్నీరు పెట్టడం లేదని, రాష్ట్రంలోని కూలీల నుంచి ధనికుల వరకు అందరూ బాధపడుతున్నారన్నారు.
చంద్రబాబును ఎక్కడికక్కడ అవమానపరిస్తే రాజధానిని సులభంగా మార్చవచ్చని జగన్ భావిస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతలు సిగ్గు పడేలా త్వరలోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన జరుగుతుందన్నారు. మరోవైపు పోలీసులు చింతమనేనితో పాటు ఆయన అనుచరులను బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో మందడంలో కాసేపు ఉద్రికత్త పరిస్థితి చోటుచేసుకుంది.













