వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార బలంతో వైసీపీ అరాచకాలు, ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పొద్దున్న లేస్తే ఎవరి ఆస్తులు విధ్వంసం చేద్దాం, ఎవరిపై అక్రమ కేసులు పెడదామా అని ముఖ్యమంత్రి ఆలోచిస్తుంటే, వైసీపీ కార్యకర్తలు మాత్రం ఎవరిపై దాడి చేద్దాం, ఎవరి ప్రాణాలు తీద్దాం, ఎవరి ఆస్తులు లాక్కుందామా అని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన మున్సిపల్ చైర్పర్సన్ రమాదేవి భర్త, కుమారుల, బంధువులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు మంచి చేయాలన్న ధ్యాస సీఎం జగన్కు ఏ మాత్రం లేదన్నారు. ఆస్తుల ధ్వంసం, ఆక్రమ కేసులపైనే ఆయన ధ్యాస పెడుతున్నారు. వైసీపీ ఆలోచనంతా దాడులు, ప్రాణాలు తీయడంపైనే ఉంది. అరాచకాలకు తెగబడుతూ ప్రజలను భయపెడుతున్నారు. 2024లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. అరాచక వైసీపీ రౌడీ ముఖలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని హెచ్చరించారు.













