అధికారంలోకి రాబోయేది టీడీపీనే

ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీయే అధికారం చేపడుతుందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరిగి టీడీపీని ఆదరించారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో తాము గెలుస్తామని వైకాపా గ్లోబెల్ ప్రచారాలు చేసుకుంటోందని ఎద్దెవా చేశారు. వైకాపా ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు సాధ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే అమరావతిలో రాజధాని నిర్మాణం, హైకోర్టు భవనాలు, పోలవరం ప్రాజెక్టు తదితరాలు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అందుకు నిదర్శనమే ప్రజలు క్యూలో నిలబడి అర్థరాత్రి వరకు ఓట్లు వేశారని గుర్తు చేశారు.
ఈవీఎంలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఢీల్లీనందు గళం విప్పారని అందుకు అన్ని పార్టీల మద్దతు లభించిందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అన్నారు. ఎన్నికల సంఘం తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగిస్తే సారీ చెప్పి మిన్నకుండిపోయిందన్నారు. రాష్ట్రంలో ఈసారి 120 నుంచి 130 సీట్లు టీడీపీకి వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.