పంచాయతి ఎన్నికల ఫలితాలు- నాయకులకు దైర్యం చెప్పిన కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి జోష్ ఇచ్చాయనే విషయం ఫలితాల ఆధారంగా అర్ధమైంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న పార్టీకి ఈ ఫలితాలు ఇప్పుడు మంచి ఊపు తెచ్చాయి. 2019 ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఆందోళన కలిగించింది. కార్యకర్తలు చాలా మంది ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేసినా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతల నుంచి సహాయ సహకారాలు కనపడలేదు. దీనితో చాలా మంది కార్యకర్తలు, స్థానిక నాయకులు పార్టీ జెండా మోయడానికి ఆసక్తి చూపించలేదు.
అయితే స్థానిక ఎన్నికల్లో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చాయి అంటే ప్రధాన కారణం కార్యకర్తలే. రాయలసీమ జిల్లాల్లో వ్యక్తిగతంగా వారి మీద ఒత్తిడి ఉన్నా సరే వెనక్కు తగ్గకుండా నామినేషన్ లు దాఖలు చేసారు. పోలీసులు, అధికార వ్యవస్థ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయనే ఆరోపణల సమయంలో కూడా కార్యకర్తలు వెనక్కు తగ్గలేదు. ఇప్పుడా కార్యకర్తలే పార్టీకి దిక్కయ్యారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో బాగా వినపడుతున్నాయి. ఇన్ని రోజులు జెండా మోసిన కార్యకర్తలే పదవులు అనుభవించిన నేతలకు ధైర్యం ఇచ్చారని అంటున్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో 90 శాతం మంది ప్రజల్లో సంతృప్తి ఉందనే విషయాన్ని వైసీపీ అధిష్టానం పదే పదే చెప్తూ… స్థానిక నేతలతో కూడా ప్రచారం చేయిస్తూ, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తుంది. అది నిజమై ఉంటే వైసీపీ 95 శాతం పంచాయితీలు గెలవాలి… తెలంగాణా తరహాలో విపక్షాలు సోదిలో కూడా ఉండకూడదు. కాని అలాంటి పరిస్థితి ఏపీలో లేదు. కాబట్టి ఇప్పుడు టీడీపీలో ఒక మాదిరి నేతలు అందరూ కూడా పునరాలోచనలో పడాల్సిన అవసరం ఉంది.
వ్యక్తిగత జీవితాలను సైతం పార్టీ కోసం పణంగా పెట్టిన కార్యకర్తలను చూసి చాలా నేర్చుకుంటే బాగుంటుందని అంటున్నారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ముందుకు నడుస్తుందా లేదా అనే దాని మీద చాలా మందికి ఒక స్పష్టత వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు బయటకు రావాలి. జెండా మోసిన కార్యకర్తలకు ఇంకాస్త ప్రోత్సాహం అందించాలి. 2019 ఎన్నికల తర్వాత వ్యాపారాల కోసం లొంగిపోయిన నేతలు అందరూ కూడా నియోజకవర్గాల్లో తిరగాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళిన నాయకులు నియోజకవర్గాలకు రావాల్సి ఉంది.
బలంగా పోరాటం చేస్తే మంచి ఫలితం ఉంటుందని కార్యకర్తలు ప్రతీ నియోజకవర్గంలో చూపించారు కాబట్టి వారితో తెగిపోయిన సంబంధాలను మళ్ళీ బలోపేతం చేసుకోవాలి. అధిష్టాన నేతలకు నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని వివరించాలి. ప్రతీ గ్రామంలో పర్యటనలు చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు చెప్పినట్టు కార్యకర్తలు, ప్రజలు హీరోలు కాబట్టి… నాయకత్వం వహించే నేతలు అందరూ ముందుకు వస్తే బాగుంటుందని టీడీపీ వర్గాలు కోరుతున్నాయి. మరి ఈ ఫలితాలను టీడీపీ ఎంత వరకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్తుందో చూడాలి.













