ముద్రగడ ద్వారా గేమ్ షురూ చేసిన జనసేన – టీడీపీ!
ముద్రగడ పద్మనాభం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. తనదైన శైలిలో రాజకీయం చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. అయితే ముద్రగడ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారో అస్సలు అర్థం కాదు. ఏ క్షణంలో ఎవరివైపు మాట్లాడతారో.. ఎప్పుడు ఏ పార్టీవైపు నిలబడతారో చెప్పడం చాలా కష్టం. అయితే కాపులకు తాను ప్రతినిధినని ముద్రగడ చెప్పుకుంటూ ఉంటారు. ఉన్నవాళ్లలో కాస్త సీనియర్ లీడర్ కావడంతో పలువురు ఆయన్ను అభిమానిస్తూ ఉంటారు. ఈ అభిమానాన్ని సొమ్ము చేసుకోవడంలో ముద్రగడ ఎప్పుడూ ముందుంటారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ముద్రగడ ఉద్యమించారు. తుని రైలు ఘటన మనకు తెలిసిన విషయమే. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. టీడీపీ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ రిజర్వేషన్ మాత్రం అమలుకాలేదు. అయినా ముద్రగడ నోరు మెదపలేదు. పైగా జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడుతూ వచ్చారు. ఈసారి ఏకంగా వైసీపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహపడ్డారు.
వైసీపీ కూడా ముద్రగడకు సీటు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంది. నేడోరేపో పార్టీలో చేరడం ఖాయమనుకున్నారు. అయితే పార్టీలో చేరే ముందు ముద్రగడ పెట్టిన షరతులు విని వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయినట్టు సమాచారం. తనకు మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ రాయబారులు కిమ్మనకుండా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నేరుగా తాడేపల్లికి తిరిగి వచ్చేసినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. ముద్రగడను చేర్చుకుని కాపుల ఓట్లు రాబట్టుకోవాలన్న జగన్ ఎత్తుగడకు బ్రేక్ పడడంతో ఈ రెండు పార్టీలూ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాయి. వెంటనే జనసేన, టీడీపీ ప్రతినిధులు వెళ్లి కిర్లంపూడిలో ముద్రగడను కలిశారు. పార్టీల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. సేమ్ డిమాండ్స్ వినిపించారు ముద్రగడ. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నందున సీట్లు అడ్జస్ట్ చేయగలమని హామీ ఇచ్చారట. తూర్పుగోదావరిలో రెండు, నెల్లూరు జిల్లాలో ఒకసీటు ముద్రగడ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగోలా ముద్రగడను వైసీపీలో చేరకుండా బ్రేక్ వేయగలిగితే కాపు ఓట్లు కొల్లగొట్టొచ్చు.. పైగా కాపులందరికీ జగన్ ను శత్రువును చేయొచ్చనే ప్లాన్ వేశాయి జనసేన – టీడీపీ. సో.. త్వరలోనే ఈ రెండు పార్టీలు మెడలో వేసుకునేందుకు ముద్రగడ దాదాపు రెడీ అయిపోయారన్నమాట.













