టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో మరో కీలక హామీ
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్లో కీలక భేటీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు. చంద్రబాబు, పవన్ కలిసి ఫిబ్రవరి 28న భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి కార్యచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ, జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఇరు పార్టీల నేతలు సీరియస్గా తీసుకున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని హాజరయ్యారు.













