పొత్తు పొడిచేనా?
వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలు వైసీపీని నేరుగా తాకుతుంటే… టీడీపీకి పరోక్షంగా తగులుతున్నాయా? గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లోనూ వైసీపీని గెలవనివ్వమన్న పవన్ వ్యాఖ్యల వెనక మర్మమేంటి?ఇప్పుడు ఇదే అంశం టీడీపీనేతలను అయోమయంలో పడేస్తోంది. అంటే ఆ స్థానాల్లో తాము పోటీ చేసి గెలుస్తామని పవన్ సంకేతాలిస్తున్నారా? లేదంటే.. గోదావరి జిల్లాల్లో అధికశాతం సీట్లు తమకే కావాలని ముందుగానే మెసేజిస్తున్నారా? పవన్, బీజేపీ అండతో గట్టెక్కేస్తామన్న సైకిల్ పార్టీ ఆనందం కాస్తా పవన్ ప్రకటనతో ఆవిరవుతోందా?
టీడీపీ, జనసేన, బీజేపీ అలయెన్స్ అయితే 130 సీట్లకుపైగా వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు ముందస్తు అంచనాలు వేసుకున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన శ్రేణులు సైతం సమన్వయం చేసుకోవడం ప్రారంభించాయి. బీజేపీ కేడర్ సైతం కలిసిపోయేందుకు మానసికంగా సిద్ధమైంది. సరిగ్గా ఇటువంటి తరుణంలో పవన్ టీడీపీని ఢిఫెన్స్ లో పడేశారు. వారాహి యాత్రలో విభిన్నమైన ప్రకటనలు చేసి ఆ పార్టీ నోట్లో పచ్చి వెలక్కాయ పడేశారు. తనను మాత్రమే గెలిపించండి. తనకు మాత్రమే సీఎం చాన్సివ్వండి. మీ భరోసాకు జనసేన పూచీ అంటుడడంతో … ఇక పొత్తులు ఉండవా అన్న సందేహంలో టీడీపీ కేడర్ పడిపోయింది.
అటు బీజేపీ పెద్దలు సైతం పొత్తును ఫైనలైజ్ చేయలేదు. ఇంకా అవి ప్రాథమిక స్థాయిలో జరిగిన చర్చలే అన్నట్టు చంద్రబాబు ఉన్నారు. దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు. ఇటు వారాహి యాత్రలో పవన్ వైసీపీని టార్గెట్ చేస్తున్నా.. ఎక్కడ పొత్తు పెటాకులవుతుందో? పవన్ చేజారిపోతారన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న జనసేన కొద్దిగా తగ్గి వ్యవహరిస్తోంది. అధికార పార్టీ సైలెంట్ కావడం, బీజేపీ నుంచి సంకేతాలు నిలిచిపోవడం, పవన్ స్వరం మారడం వంటి పరిణామాలతో టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది.
అయితే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడంపై టీడీపీలో అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ ఇది పొత్తుకు విఘాతం కలిగించే అంశం కాదని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో వైసీపీ గెలవనివ్వనని అనడాన్ని గుర్తుచేస్తోంది. ఆ 34 నియోజకవర్గాల్లో జనసేన మాత్రమే గెలుస్తుందని చెప్పలేదని.. వైసీపీ ఓడిపోతుందని మాత్రమే చెప్పారని ఉదహరిస్తోంది. అంటే ఇంకా పొత్తుల అంశాన్ని పవన్ సజీవంగా ఉంచారని టీడీపీ భావిస్తోంది.













